Friday, 30 August 2024

కవిత::తలపు తాంబూలం

 ధైర్యం ప్రేరణలకి తావిచ్చి

మనసు తెరచాప చాచి 

ప్రణయతరువే నీడను పంచేవేళ 

ఎదమీటే తీపిరాగమే ప్రేమాకాదాల్  


మైమరచే తపనలకి

తపించే తమకాలకి 

మైత్రికుదిరితే సరాగమే 

కలహమాడితే విరాగమే 


సహకారాల మైత్రివనానికి 

మమతల బంధుజనానికి 

కుదిరి నప్పితే సరిజోడి 

పండుగ లాంటి హడావిడే 


సొగసులే సైగచేసి పలకరించి 

మత్తుగా మదిని దోచిననాడు 

హృదికోరికలే గేయాలు పాడు 

మోహాలే ఆనందనర్తనలు ఆడు


వివశత్వపు వలపులలో

సహనమే గెలుపుగుర్రం

తన్మయత్వపు మురిపాలలో 

సంబరమే సిరిచందనవనం 


ప్రణయాలేలు వలపు రాజ్యానికి  

తోడుండే నెచ్చెలే పట్టపురాణి 

మరి ప్రియభాష్యాలే పరిచారికలు

ఇక తబ్బిబ్బూలే పల్లకీమోతలు


వలపే విశ్వవిజేతని

ఒప్పవా చంద్రముఖి 

తలపే తాంబూలమివ్వ

అందుకోవా ప్రియసఖీ

••••••••••••••

జగన్/విసురజ

No comments:

Post a Comment