Friday, 30 August 2024

కవిత: తెలుగు వెలుగు/వెలిగే తెలుగు

 అమ్మ పాలల్లే స్వచ్చమైనది 

మన తేనెలూరు తెలుగు

వాన చినుకల్లే చిందేయునది  

మేటి తేనెలూరు తెలుగు


కోకిల పాటల్లే బహుదొడ్డ 

తీయనైనది తేనెలూరు తెలుగు

మామిది తాండ్రల్లే అమితంగ 

తీపైనది తేనెలూరు తెలుగు


పున్నమి వెలుగల్లే కాంతిని  

పంచేది తేనెలూరు తెలుగు

ప్రేయసి దరహాశమల్లే చిత్తశాంతిని అందించేది తేనెలూరు తెలుగు


సంపెంగల పూలల్లే సువాసనభరితం  ప్రమోదాల తేనెలూరు తెలుగు

మల్లెమొగ్గల మాలలల్లే పరిమళభరితం   పసందైన తేనెలూరు తెలుగు


వయసు కొచ్చిన సొగసరి సిగ్గల్లే

సొగసైనది తేనెలూరు తెలుగు

ఏపుగా పెరిగి కోతకొచ్చిన బయలల్లె  

కంటికింపైనది తేనెలూరు తెలుగు


రంగురంగుల సీతాకోకచిలుకల రెక్కలల్లే మృదువైనది తేనెలూరు తెలుగు

అధరసుధల ప్రియమనోహరి బుగ్గలల్లే మెరిసిపోవునది తేనెలూరు తెలుగు


పేదోనికి భారమయ్యేటి నేటి కూరల ధరల్లే ఘాటైనది తేనెలూరు తెలుగు

ఘనచరిత్ర గల గుంటూరు ఎర్ర మిర్చల్లే   ఠారెత్తెంచేది తేనెలూరు తెలుగు


మంచిమనసుకు, మంచిమాటకు, మంచిచేతకు ఎల్లలు లేవని 

చాటిచెప్పేది తేనెలూరు తెలుగు


సమాజహితానికి, సౌందర్యారాధనకు, సత్యసందర్శనకు అడ్డుగోడలు లేవని  తెలియచెప్పేది తేనెలూరు తెలుగు


తెలుగు వెలుగును కనులారాకనరా 

మనసారా మనసైన తెలుగోడా

తెలుగు వెలుగుల అవిరళకృషికి

మనసును అర్పించరా తెలుగోడా

••••••••••

విసురజ

29/06/2024


(నేటి తెలుగు భాషా దినోత్సవ శుభ సందర్భాన)

No comments:

Post a Comment