ఏమని వర్ణించను నీ రూపుని
ఎంతని కీర్తించను నీ మేలుని
తులసీదాసా కుచేల దరిద్రహరా
నమో నమో కన్నా, నన్ను కావవా వైకుంఠదేవ
లలాటాన కస్తూరి తిలకం
వక్షభాగాన చక్కని కౌస్తభం
మెడలో వైజయంతి మాల
నమో నమో కృష్ణా, నీ సోకు సుమనోహరం
సిగలో పింఛం చేతిలో మురళి
మోమున అరనవ్వు పలుకులో మార్దవం
పిలుపులో ఆత్మీయం గుండెలో ప్రణయం
నమో నమో కన్నా, నీ రూపు భక్తరసామృతం
బుడిబుడి నడకలకు
చిరుచిరు నగువులకు
కిలకిల పలుకురవాలకు
నమో నమో కృష్ణా, నీ సన్నిధే ఎనలేని పెన్నిధి
వసుదేవ దేవకి సంతువి
నందరాజ యశోద బిడ్డవి
గోకులాన్ని కాచిన దేవుడివి
నమో నమో కన్నా, నీ శరణు పాప హరణం
రాధా మనోహరడవు గోపికా వల్లభుడవి
రుక్మిణీ ప్రియనాధుడవు ధర్మ పాలకుడవి
భక్తాభయ రక్షకుడవు బృందావన విహారివి
నమో నమో కృష్ణా, నీవు గీతా గోవిందుడువి
తలెత్తి చూస్తే సర్వత్రా నీవే
తల వాలిపోతే చేరేది నిన్నే
ఈ మధ్యలో బంధాల లంపటాలు
నమో నమో కన్నా, ఏర్పరచి గిల్లి నవ్విచూసేది నీవే
ఏదెట్టున్నా ఏమైనా
ఎక్కెడెక్కడ వాళ్ళమైనా
కడకు చేరేది నీ చెంతకే
నమో నమో కృష్ణా, చింతేల నీ తలపే శ్రీకరముగా
•••••••••••
విసురజ
26/08/2024
(కృష్ణాష్టమి సందర్భముగా)
No comments:
Post a Comment