Friday, 30 August 2024

కవిత:సగటు నరుని బ్రతుకు

 నిప్పుల కొలిమిల్లే ఎండ 

మంటెట్టి కసి తీరా కొరికి  

లాగిపెట్టి గీర జెల్ల కొట్టింది 

సగటునరుని నిత్య బ్రతుకు పడకేసింది 


రెక్కాడితే డొక్కాడని బడుగుజీవికి  

గుక్కెడు నీళ్లకూ కటకటలే 

గుప్పెడు అన్నమూ దొరకట్లే 

సగటునరుని నిత్య బ్రతుకు పాడెక్కింది  

 

తరువులని నరుక్కుంటు అలా పోతుంటే  

ధరణి పచ్చదనాన్ని యిలా చిదిమేస్తుంటే  

కార్చబోదు నింగి బడుగుకై చుక్కకన్నీరు 

సగటునరుని నిత్య బ్రతుకు అస్తవ్యస్తమయ్యింది  


రోడ్డెక్కకే పూటగడవని జనావళికి 

ఎండవేళ నీడకరువు మృగ్యమయ్యే 

ప్రకృతితో పరాచికం వృక్షరిక్త జనావాసం

సగటునరుని నిత్య బ్రతుకు కుదేలైపోయ్యింది   


పెరుగుతున్న జనాభా నిలువ నీడకై  

నరికిన తరువుల బదులుగా చెట్లు 

వేలసంఖ్యలో నాటి చేయాలి హరితవనం

సగటునరుని నిత్యబ్రతుకు పదిమందికవ్వాలి ఆదర్శజీవనం.

•••••••••

విసురజ/జగన్నాధ్

25/05/2024

No comments:

Post a Comment