Friday, 30 August 2024

కవిత:ప్రణయ నివేదన

 హేమంతాలలో విరిసే 

నవ కుసుమం నువ్వు

పుడమిని వెచ్చగా తాకే 

తొలి రవికిరణం నువ్వు..


మనసు ఒడిలో చేరబూనే  

వలపు వటువు నువ్వు

అక్షరాలతో ఆర్తిగా ముద్దాడే  

ఆధరాల కొంటెనవ్వు నువ్వు..


నా 

కరగని స్వప్నం నువ్వు 

చెరగని హాసం నువ్వు 

చెదరని ధైర్యం నువ్వు 

ప్రణయ ఆహార్యం నువ్వు 


నీ 

రూపం అపురూపం   

మధురలావణ్య సుమదళం  

హాస్యవిలాస లాస్యం  

అమరవేల్పుల చిరుదరహాసం 


నువ్వు 

అడిగావని నేను 

నీకై తపన పడలేను 


నువ్వు 

వద్దన్నావని నేను 

నీకై ఆలోచన వీడలేను 


కూడదని మనకి జతకుదరదని  

చెదిరిన చిత్తముతో నువ్వన్నావు  

తలపుల్లో ఎద పిలుపుల్లో  

నువ్వున్న సంగతి మరిచావు 


నీవు 

వద్దనుకున్నా పల్లవిస్తాను 

చిగురేసే ప్రణయ ఋతువుల్లో 

నీవు 

వలదన్న తొంగిచూస్తాను 

ఎద ప్రేమద్వీప కనుమల్లో 


నీవు 

చేరువ కాలేదని బెంగచే 

మదిలో బడబాగ్ని రగిలే     


నీవు

అందివ్వకే చేయిని హృదిని 

మనసు అగ్నిగుండమై వెలిగే  


నింగిలో 

వెలిగే రవిరాజుకై 

కమలం విరిసి మైమరచింది    


ప్రణయమిచ్చే 

వలపు తాంబూలంకై  

మురిసిన మనసు ముస్తాబయ్యింది 


చల్లగాలి మెల్లగా 

వీచి విజిలేసి 

మదిలో కమ్మని 

చిలిపి ఊహలని రేపిపోయే  


నీలాల మేఘబాల 

మత్తుగా గమ్మత్తుగా 

ప్రణయపు ఆర్తితో 

తేనె వానలను కురిసిపోయే  


నీ ఔనుకై 

మనసారా అభ్యర్థిస్తుంటా

జీవితాంతం వేచుంటా..


ఏది ఏమైనా  

చెలికై వేచు 

కవికిశోర మానసం  

రమణీయ కవితాపుష్పం.. 

••••••••••

విసురజ

No comments:

Post a Comment