Friday, 30 August 2024

కవిత:స్త్రీ, చైతన్యశ్రీ కి జయజయహో

 కష్టమని, ప్రాణాంతకమని తెలిసీ కూడా 

మరో తరానికి జన్మనిచ్చే జాహ్నవి మగువేగా 


చిన్ననాటినుండి ఆటలలో అల్లరిలో 

చేదోడు వాదోడుగా వుండే తోబుట్టువూ మగువేగా 


ఆకలివేళ కడుపాకలి కనుక్కుని

ఆకలి తీరేలా అన్నంపెట్టే అమ్మా మగువేగా 


వయసొచ్చాక అనురాగం అంకురిస్తే

తోడుగ కలిసుండే కన్యారత్నమూ మగువేగా 


నచ్చుకుని మెచ్చుకుని చేయిపట్టుకుంటే

కట్టె కాలేదాకా క్రీనీడలా వెన్నుండేది మగువేగా 


బుద్దిబలంతో ప్రజ్ఞచే ఇంటా బయటా తప్పక గెలిపించు ఇంతిపూబంతీ మగువేగా 


జీవానికి ప్రాణం పోసి 

జీవితానికి అర్ధం నేర్పుతావు

తల్లీ నారీ శిరోమణి నీకు సాటి ఎవరమ్మా


భవితవై పలకరిస్తూ 

బ్రతుక్కి బేషైన బాష్యమౌతావు

తల్లీ నారీ శిరోమణి నీకు సాటి ఎవరమ్మా


లాలిత్యబాలవై కులుకుల కోమలివై  

కంజాత అందాలకే పోటీకొస్తావు

తల్లీ నారీ శిరోమణి నీకు సాటి ఎవరమ్మా


అందాలకి నిఘంటవువై 

అందీ అందని అందమవుతావు

తల్లీ నారీ శిరోమణి నీకు సాటి ఎవరమ్మా


ప్రణయదీపాల వెలుతురై 

ప్రేమ తీరానికి గట్టువవుతావు

తల్లీ నారీ శిరోమణి నీకు సాటి ఎవరమ్మా


ఆలివై అలరిస్తూ పాలిస్తూ 

కుటుంబానికి అలంబనగా నిలుస్తావు

తల్లీ నారీ శిరోమణి నీకు సాటి ఎవరమ్మా


పరువుకై ప్రాణాలిస్తూ 

అవసరమైతే దానికై ప్రాణాలు తీస్తావు 

తల్లీ నారీ శిరోమణి నీకు సాటి ఎవరమ్మా


కొత్త బంగారులోకం సృష్టి చేసే 

చేవ గల అతివగా ఖ్యాతిగాంచేవు

తల్లీ నారీ శిరోమణి నీకు సాటి ఎవరమ్మా


నీవు లేక జగతి లేదు 

జనహితం లేదు

నీవు లేక సుగతి లేదు 

సుచరితం లేదు

తల్లీ నారీ శిరోమణి 

నీకు సాటి ఎవరమ్మా

నీవు స్త్రీవి చైతన్యశ్రీవి..

•••••••••

విసురజ@08/03/2024

No comments:

Post a Comment