Friday, 30 August 2024

కవిత:*ఆత్మవలోకనం

 నాకై నేనే 

ప్రశ్న వేసుకుని

నేనెవరినోనని తెలుసుకోవాలని 

ఆత్మావలోకనం చేసుకున్నా..


మరిహ చూస్తే..


కళ్ళు తెరిచాక 

ఆకలి తీర్చిన 

అమ్మే లోకమయ్యింది

అమ్మతోడిదే లోకమనుకున్నా.. 


నడక నేర్వబోవ 

వేలుపట్టి నేర్పిస్తూ 

నడిపించే తండ్రినే 

చూడని దైవమనుకున్నా.. 


మాట నేర్చినాక

చదువు బోధించి     

బ్రతుకునిచ్చు మాష్టారే

ఆత్మీయ బాంధవుడనుకున్నా.. 


ఉద్యోగ వ్యాపారయాత్రలలో  

అభ్యసించిన విజ్ఞానమే

నన్ను తీర్చిదిద్దు 

బంధువు ఆత్మజుడనుకున్నా.. 


మనసు మేను 

డస్సి అలసినవేళ 

చెలి చిరునవ్వులే  

సాంత్వనల సముద్రమనుకున్నా.. 


ప్రియబంధాల నడుమ

బ్రతుకు జైత్రయాత్రలో 

అనునిత్యపు సంఘర్షణలలో 

జీవితాన్ని పరికించా..

 

ప్రణయాలు సరాగాలు 

వట్టిమాటల వ్యర్ధబాటని 

సాపాటుపెట్టే సామాగ్రికాదని     

నిజంతెల్సి తీరుమార్చుకున్నా..


సిసలైన వాస్తవాన్ని 

గ్రహించినాక జాగుచేయక 

సత్తువున్న వేళల్లోనే 

పరుగాపక తెగకష్టపడినా..


రంగులమార్చు జగాన  

సర్వత్రా పనికొచ్చే

కరెన్సీకబుర్ల భాగవతాన్ని (భాగోతాన్ని) 

నలుగురికి చేరవేస్తున్నా..


మెరుపుల జిలుగుల

కరెన్సీలప్రభలే విరజిమ్మగా 

అనురాగ ఆప్యాయతలు  

వద్దనుకున్నా తలవంచేనని..

•••••••••••••••••••

విసురజ/వి.జగన్నాథ్

కవిత:అంతరం-ఆంతర్యం

 జీవితపురంగులను ఆస్వాదించలేకపోతే కొత్తవ్యక్తులసాంగత్యాన్ని నీవు నచ్చలేకుంటే


కళ్ళల్లోమెరుపుకి మమతలకి కారణమైనవారిని నీవు దూరంచేసుకుంటే


అత్యవసరమైన ప్రయాణాలెన్నెన్నో  

కష్టతరమైనవని నీవు మానుకుంటే


చదువవలసిన చదువులెన్నెన్నో  శుద్దదండుగని నీవు మానుకుంటే


ఉదయించే క్రొత్తతలపులెన్నిటికో 

మనస్సూర్రూతలూగినా నీవు వినకుంటే


ఆత్మీయరాగాలే వసంతగానాలై

వయసుబాజాలతో వినిపిస్తున్న తెలియకుంటే


బ్రతుకుయాత్రలో ఎదుగుదలలో  

గెలుపుబాటలో నీవు సాగాలనుకుంటే 


మార్పుచెందక తీరుమార్చుకోక 

తప్పుదారిలో నీవు వద్దన్నాపోతుంటే


దుర్వ్యసనాలకు దుర్భాషలకు 

చెత్తాలవాట్లకు నీవు దిక్సూచివైతే 


అంతర్మధనాన్ని ఆత్మవలోకనాన్ని 

ఆత్మగౌరవాన్ని నీవు సమాధిచేసుకుంటే


నిస్తేజమవుతున్నట్టే నీరసపడుతున్నట్టే మరణానికి నీవింక చేరువవుతున్నట్టే

•••••••••

జగన్/విసురజ

కవిత:యువత (కష్టాల) కేక

 చదువులింతంతా ఏలలే..ఉద్యోగాలేమి లేవులే 

పరుగులింక తగ్గింపుము వెఱ్ఱితనము విడువుములే

చదువులింతంతా ఏలలే ....


చరణం 1 :

తిండిలేక నీరసము మోములోన తొణికెనులే

తిండిలేక నీరసము మోములోన తొణికెనులే

ఒంటి సత్తువ తగ్గెనులే..

ఒంటి సత్తువ తగ్గెనులే..

బ్రతుకేమిటో తెలిసెనులే..

..చదువులింతంతా ఏలలే..


చరణం 2 :

తీరికున్న ఏమాయెను ఖాళీలే 

కానవాయిలే 

తీరికున్న ఏమాయెను ఖాళీలే 

కానవాయిలే 

ప్రభు దయతో కాచుకొనుము..'

ప్రభూ దయతో కాచుకొనుము..అణుకువన 

ఉండేదలే.. 

...చదువులింతంతా ఏలలే ....


చరణం 3 : 

పంపుల ధారలే నా ఆకలి తీర్చెనులే 

పంపుల ధారలే నా ఆకలి తీర్చెనులే..

క్షుద్భాధకునే చుట్టములే..

క్షుద్భాధకు నే చుట్టములే..కలలిక 

కల్లలులే..


చదువులింతంతా ఏలలే..ఉద్యోగాలేమి  లేవులే 

పరుగులింక తగ్గింపుము వెఱ్ఱితనము విడువుములే

చదువులింతంతా ఏలలే ....

కవిత:ప్రేమ పలుకు

 ఊహలే పిలిచే....ఓ చెలియా 

నీ నగవులె చిలికే....వలపులూ 

నీ ఊహలు నను పిలిచే ఓ చెలియా 

నగవులే చిలుకులే మధుర వలపులు 


చరణం

నీ ప్రణయం పొందగ

వేడుకయే 

నా మానసానికి అదియే 

పండుగలే 


నా మదిరాణివి నీవేలే 

నన్నేలు సొగసు నీదేలే (నీ)


చరణం

రస మయ ప్రణయపు 

పిలుపులంటే చెలి

నవ ప్రేమ జంటల 

కూజితాలవే మరి


నా మదిరాణివి నీవేలే 

నన్నేలు సొగసు నీదేలే 


చరణం

తీపి తపనల గోదారే 

నా ప్రేమ సఖియా 

నీ అనురాగ సాగరంలో 

మునకేసి మురిసిపోయే 


నా మదిరాణివి నీవేలే 

నన్నేలు సొగసు నీదేలే 


చరణం

నిను చూడక 

క్షణమైన తాళలేను 

నీవు ఎదురైతే 

పెదవే విప్పలేను  


నా మదిరాణివి నీవేలే 

నన్నేలు సొగసు నీదేలే 

••••••••••••••••••

జగన్నాథ్/విసురజ..

కవిత:రామసుధాగానం, మధురం.. అమరం

 రవికులశ్రేష్టుడు కులదీపకుడు

నీలమేఘశ్యాముడు రఘురాముడు

సాకేతపురేసుడు కౌసల్యాసుపుత్రుడు దశరథనందనుడు శ్రీరాముడు  


ముగ్గురు తమ్ముళ్ళ ముద్దుల అన్నయ్య సౌమిత్రిఅగ్రజుడు నీరజాక్షుడు

ముగ్గురు అమ్మల ముద్దుల కన్నయ్య శ్రీరాఘవుడు సత్యనిష్టుడు


మహనీయుడు సుందరరాముడు 

మైత్రీమర్యాదలకు చిరునామనతడు

భారతశత్రఘ్నసోదరుడు ఘనవీరుడు 

మానధనుడు మృదుభాషచరితుడు  


కులగురువు వశిష్టుడు  

వినయ విద్యావిషయాలు నేర్పించే

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు 

అస్త్రశస్త్ర విలువిద్యలు బోధించే 


నడిచే రామ లక్ష్మణులు

యాగసంరక్షనార్ధం విశ్వామిత్రుని వెంట

అహల్య ఎదుట నిలిచే 

రామపాదం తాకి పూర్వరూపమొంద 


రక్కసులు మారీచి సుభాహులు 

ఋషులయాగ ధ్వంసానికై వచ్చారు

తిని రామలక్ష్మణుల చేతిలో 

చావుదెబ్బలు చివరకు చచ్చారు


శివధనుస్సు ఎక్కుపెడితేనే  

జనకపుత్రి సీత అందేనని 

స్వయంవరపు షరతు తెలిసి 

ధరలో రాజులెందరో వెన్నుచూపిరి 


అల్చిప్పలాంటి కళ్ళతో

బేలగ చూసే సీత 

శివధనుస్సు ఎత్తు వీరునికై

జానకి మనసు ఆత్రుతపడే 



గురువు విశ్వామిత్రుల ఆజ్ఞ మేరకు 

నమస్కరించి లలనసీతను చూస్తూ ఒంటిచేత్తో ఎత్తిపెట్టి శివధనుస్సుకు 

విల్లుకు నారికట్టంగా పెళ్లునదివిరిగే 


సిగ్గరి సీత బుగ్గల్లో 

రోజామెగ్గలు ముగ్గులు వేయ

ఉరికే సీత వరమాలతో 

గెలిచిన శ్రీరాముని అలంకరించే 


పెద్దలే ఆనందించ 

దీవతలే దీవించ 

జరిగే సీతారాముల పరిణయం

ధరణి జనులు హర్షమొందె 


సాకేతపుర సామ్రాట్టని చేయ 

ముహూర్తం పెట్టించే దశరధుడు

రాఘవుడి సీతే పట్టమహిషని 

సంబరాల్ని నెరిపే జనకుడు


మంధర కుద్బోధ

కర్కసి కైకేయి వరబాధే 

దశరధునికి గ్రహబాధయ్యే

రామసీతలవనవాస కారణమయ్యే


నారచీరతో విద్యుల్లతసీత 

నీరబట్టలతో రామలక్ష్మణులు కానలకేగే

అయోధ్యపురజనుల కన్నీళ్ళకు హృదయఘోషకు తుదిలేకపోయే


తండ్రిమాటను జవదాటని పుత్రుడే 

పావనచరితుడని శ్రీరాముడు ఆచరణలో చూపే 

రామసీతల నామస్మరణే భవసాగరాన్ని  తప్పించునని 

జీవన్ముక్తి కలిగించునని శ్రీరామకథ చెప్పకచెప్పే..

రామసుధాగానం మధురం అమరం 

రామనామ స్మరణం భవసాగరహరణం..

•••••••••

జగన్నాథ్/విసురజ

కవిత:ఏది, ఏదేది మధురం

 ఉదయవేళ ప్రత్యూష విమలకాంతులు

గోధూళివేళ బర్రెల ఉరుకులపరుగులు 

వ్యాహాళివేళ పక్షుల కువకువకబుర్లు

మంచులో తడిసినపూల నెత్తావులు 

మధురం మధురం మధురాతి మధురం


పసి పాప బోసినవ్వులు

లేగ దూడ గంతులాటలు

నింగి మెడలో నక్షత్రనెక్లేసులు 

జాబిలమ్మ పంచు వెన్నెలందాలు

మధురం మధురం మధురాతి మధురం 


యద్దనపూడి కథానాయకుని వర్ణనలు

యండమూరి నవ్యకథనా రీతులు

మల్లాదికృష్ణుని నవరసాల వితరణలు 

యెర్రంశెట్టిసాయి హాస్యామృత చెణుకులు

మధురం మధురం మధురాతి మధురం 


ఆత్రేయ మనసుగీతాల మాలికలు

వేటూరి నవరసగీతికల సుమాలు

సినారె భావలలితగీతాల సౌరభాలు 

సిరివెన్నెల చిన్నిపదాలలో లోతైనభావనలు 

మధురం మధురం మధురాతి మధురం 


ఎస్వీర్ అద్వీతీయ నటనావైదుష్యం 

యన్టీఆర్ నవరస నటనామృతం 

ఏన్నార్ దివ్యభవ్య సుందరనాట్యం 

జగ్గయ్య కంఠ గంభీరాహార్యం 

మధురం మధురం మధురాతి మధురం 


రసవంతమైన వేమన సూక్తులు

వ్యాసరాజు మహాభారత పర్వాలు 

పోతన భాగవత నీతిబోధలు 

వాల్మీకి రామాయణ తేనియలు 

మధురం మధురం మధురాతి మధురం 


చిట్టచివరగా 

ఆత్మీయ మిత్రుల ఆలింగనాలు

బంధువుల ఆప్యాయతా అభివాదాలు

అమ్మఅమ్మాంటూ తొలి చూలు పిలుపులు

నాన్న వేలుపట్టుకుని బుల్లిగా నడవడాలు 

పెద్దలు నేర్పే అనుభవసారపు చదువులు

మధురం మధురం మధురాతి మధురం

••••••••••

విసురజ@21/03/2024

కవిత:ఆపగలనా, ఓపగలనా

ఏమని చెప్పి ఆపను

నీకై ఎగిరే పయటమ్మ వయ్యారాలను

ఎంతసేపు అట్లా ఓపను 

ఎదలో ఎగిసే కోలాహల ధ్వనులను


ఏమని చెప్పి ఊరడించను

నీకై రవళించే గుండె స్పందనలను

ఎంతసేపు అట్లా దాచను

మదిలో నర్తించే మధుర ఊహలను


ఎట్టా పగ్గాల్లాగి ఆపను

నీకై ఉరకే ప్రాయపు అశ్వాన్ని 

ఏమని చెప్పి మభ్యపెట్టను 

హృదిలో మెరిసే ప్రత్యూషపు వెలుగుల్ను


ఎంతకాలం యిట్టా భరించను

నీకై మ్రోగే పాంజీరాల సవ్వడులను

ఏ పాత్రలో దాచిపెట్టను

మురిపాలు వర్షించే ప్రణయ జల్లులను


ఎంతని ఎక్కడని దాచను

నీకై విరబూసే యవ్వన లావణ్యాన్ని

ఎంత సేపని గానం చేయను

మనసులోనే అనురాగసంగమ కృతులను


ఏమని హృదితడిని ఏమార్చను

నీకై వెదికే తలపుల వాకిళ్ళలలో

ఎక్కడ దాచి పెట్టను మదిగదిలో

అంటుకట్టిన వలపు విత్తుల గుత్తులును


త్వరగా రావచ్చి బ్రతికించు నాలో 

కురచవుతున్న వలపుపై నమ్మకాన్ని

నీ ప్రేమని అభివ్యక్తీకరణతో నిరూపించు

పలచనవుతున్న నా ప్రేమగౌరవాన్ని కాపాడి

•••••••••

విసురజ@19/03/2024