Friday, 30 August 2024

కవిత: ప్రణయ ఫిర్యాదు

 చెలిమి తీపిని చూపి 

ప్రణయ రుచిని పంచి 

చెలి నా చెంత చేరరావేమి 

వగపు వగరు రుచి చూపుతావేమి 



నీలాల నింగి తారాలన్నీ వంగి 

నీకు సలాం చేస్తున్నాయి చెలి 

నీ సౌశీల్యం వెలలేని మాణిక్యం   

నీ సోయగం కనులకు వినూత్నం 


ఎదకు సాంత్వనమివ్వ..

చెలి నా చెంత చేరరావేమి 

వగపు వగరు రుచి చూపుతావేమి 



ఈ రేయి 

నిండు పున్నమిలో 

పండు వెన్నెలలో 

తొలకరి జల్లు కురియనేలనో 

ఈ మేను మురియనేలనో 

అయినా 

చెలి నా చెంత చేరరావేమి 

వగపు వగరు రుచి చూపుతావేమి 



నెయ్యాల నావలో మనసు రాదారిలో వలపు వ్యాహాళిలో తపనల ఒడిలో 

తలపు తొందర చేయుటేలనో   

మనసు మాట వినదేలనో  



ఓ నా అభిసారికా.. 

చెలిమి తీపిని చూపి 

ప్రణయ రుచిని పంచి 

చెలి నా చెంత చేరరావేమి 

వగపు వగరు రుచి చూపుతావేమి 

••••••••••••

విసురజ/జగన్నాధ్

12/06/2024

No comments:

Post a Comment